జగిత్యాల: చితి ఆరక ముందే బంగారం కోసం మంటలపై నీళ్లు చల్లి బూడిద ఎత్తుకెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. మల్యాలలో ఓ మహిళ చనిపోవడంతో శుక్రవారం అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహానికి చితి పెట్టిన అనంతరం వారు వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోయిన తరువాత ఇద్దరు మహిళలు మృతదేహం తల భాగంపై నీరు పోసి మంటలను ఆర్పేశారు. అనంతరం బూడిదతో పాటు పుర్రెను ఎత్తుకెళ్లారు. అక్కడ ఉన్నవారు వెంబడించడంతో వారు పారిపోయారు. మహిళలు చనిపోతే వారి మెడలో ఉన్న నల్లపూసల ఆభరణం నుంచి బంగారు గుండు తీసి మృతురాలి నోట్లో పెట్టి చితికి నిప్పంటించారు. బంగారం గుండు ధర పది వేలకు పైగా ఉండటంతో దాని కోసమే పుర్రెను ఎత్తుకెళ్లి ఉంటారని బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

