- ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి
- ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు
రియాన్ పరాగ్ వ్యక్తిగత విమర్శలకు తీవ్రంగా స్పందించారు: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026లో మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పరాగ్.. తన ఆటపైనే కాదు, వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలపై గట్టిగా స్పందించాడు. కొంతమంది కామెంటేటర్లు, సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే క్రికెట్ గురించి మాట్లాడాలని, వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయకూడదని స్పష్టం చేశారు. మేము మనుషులమే అని తప్పులు జరుగుతుంటాయి, పరాగ్తోడాడు.
ఇటీవల వేపింగ్ వివాదం కారణంగా రియాన్ పరాగ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో విమర్శలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా.. ‘గత నాలుగేళ్లలో నేను ఓ విషయం అర్థం చేసుకున్నా. నేను ఏం చేసినా ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ మాటలు నా ఆటపై, ఫామ్‌పై, మైండ్‌సెట్‌పై ప్రభావం చూపకూడదని నేర్చుకున్నా. కీబోర్డ్ వారియర్స్ (ట్రోలర్స్) ఎప్పుడూ ఉంటారు. వాళ్ల మాటలను బయటే వదిలేయాలి. నా ఆటపై నాకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలుసు. అలాంటి కామెంట్లు నా ఆటను దెబ్బతీయకూడదు’ అని పరాగ్ చెప్పాడు.
ఈ ఐపీ సీజన్లో మైదానం బయట చాలా విషయాలు జరుగుతున్నాయని, కానీ భారతదేశంలోని ప్రజలు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో మీకు తెలుసునని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ‘మైదానానికి వచ్చే అభిమానుల కోసం మేము మా శక్తివంచన లేకుండా ఆడతాం. ప్రతి మ్యాచ్‌కు ముందు మేము ఎంతో కష్టపడతాం. ఒక జట్టు 75 లేదా 80 పరుగులకు ఆలౌట్ అయితే.. వాళ్లకు ఆడటం రాదని చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ మ్యాచ్‌కు ముందు మూడు, నాలుగు రోజుల పాటు ఎంత కష్టపడతామో ఎవరికీ తెలియదు. 220, 250 పరుగులు చేయాలనే ప్లాన్‌తో మైదానంలోకి దిగుతాం. కానీ ప్రతిసారి అనుకున్నట్లు జరగదు. మేము కూడా మనుషులమే. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ఎవరూ ఉండరు’ అని తెలిపాడు.
కామెంటేటర్లపై కూడా రియాన్ పరాగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉండే వాళ్ల మాటలు ప్రజలకు ఎక్కువగా చేరతాయి. అందుకే వాళ్లకు ఓ అభ్యర్థన చేస్తున్నాను. క్రికెట్‌ను ప్రేమించండి, క్రికెట్ గురించి మాట్లాడండి. వ్యక్తిగత విషయాల గురించి దయచేసి మాట్లాడకండి. భారతదేశంలో క్రికెట్ చాలా ముఖ్యమైన ఆట. ప్రపంచంలోనే మేము అత్యుత్తమంగా ఉన్నాం. అలాంటి ఆటకు గౌరవం ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశాడు. లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ ప్రస్తుత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓడినా కూడా ఇతర జట్ల ఫలితాల ఆధారంగా అవకాశాలు ఉన్నాయి.

