- అన్నం తిన్న వెంటనే నిద్ర వస్తుందా..?
- షుగర్ లెవెల్స్ కారణంగా అలసట, నిద్రమత్తు..
- సెరొటోనిన్, మెలటోనిన్ వల్ల మత్తు..
- ప్రొటీన్, ఫైబర్ ఫుడ్ కూడా తీసుకుంటే మంచిది..
Eating Rice: సాధారణంగా మనం అన్నం తిన్న వెంటనే నిద్ర వస్తుందనే వారిని చూస్తుంటాం. ఇది మనకు కూడా ఒక్కో సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అన్నం తిన్న వెంటనే కళ్లకు భారం అనిపించడం, పనిచేయాలంటే ఉత్సాహం తగ్గడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా తిన్న వెంటనే శక్తి అందాలి కానీ, అలసట ఎందుకు వస్తుందని సాధారణంగా అందర్ని వేధించే ప్రశ్న. దీని వెనక చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది.
సాధారణంగా తెల్లని బియ్యంతో వండిన అన్నం తిన్న వెంటనే మన శరీరంలో మెటబలిజం ఒక్కసారిగా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. తెల్ల బియ్యానికి ”గ్లైసిమిక్ ఇండెక్స్” చాలా ఎక్కువ. దీనితో ఇది త్వరగా జీర్ణమై, రక్తంలో గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచుతాయి. దీనిని బ్యాలెన్స్ చేయడానికి ఇన్సులిన్ కూడా పెరుగుతుంది. ప్రారంభంలో ఇది శక్తిని అందిస్తుంది, కానీ కొంత సమయం తర్వాత, ఈ శక్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది అలసటగా, నిద్రమత్తుగా భావిస్తున్నారు. ఇది శరీరంలో జీర్ణమై, రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతుంది. చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిన తర్వాత పడిపోయినప్పుడు, శరీరం నీరసంగా అనిపించవచ్చు.
ఈ ప్రక్రియలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మెదడుకు ఎక్కువగా చేరుతుంది. ఇది సెరోటినిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు మన మానసిక స్థితి, నిద్రను నియంత్రిస్తుంటాయి. అందుకే అన్నం తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవడం, నిద్ర పోవాలని అనిపించడం జరుగుతుంది.
ఒకేసారి ఎక్కువ పరిమాణంలో అన్నం తినడం, హెవీ మీల్స్ తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీనితో ఎక్కువ శక్తిని జీర్ణక్రియ కోసం వినియోగించి అలసట ఏర్పడుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే పూర్తిగా అన్నం తీసుకోవాలి. ప్రొటీన్ ఫుడ్ అంటే ఎగ్స్, చికెన్, పనీర్, పప్పులు ఆహారంలో భాగంగా ఉండాలి. దీనితో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. అన్నం తిన్న 10-15 నిమిషాల తర్వాత 15-30 నిమిషాలు నడవడం మంచిదని వైద్యులు చెబుతారు.

