మన తెలంగాణ/హైదరాబా ద్: అంతర్గత కలహాలతో పార్టీకి వాటిల్లుతోంది.. అందరినీ కలుపుకుని పోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర మంత్రులకు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్ మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతరులతో సమావేశమై జిల్లాలో నెలకొల్పిన తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీలో అంతర్గత విభేదాల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమన్వయం కొరవడిందని ఆమె అన్నారు. నిర్వహించిన ఎమ్మెల్యేలను, పార్టీ జిల్లా కార్యవర్గాలను, సీనియర్ నాయకులను, అనుబంధ కమిటీలను పట్టించుకోవడం లేదని తనకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె అన్నారు. సంస్థాగతంగా మార్పులేవైనా చేయవలసి ఉందా?, జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి ? అనే విషయాలను ఆమె సమీక్షించారు. ఇంకా ప్రతిపక్షాల పని తీరు ఎలా ఉంది? అని ఆమె అధ్యయనం చేశారు. పార్టీలో చేరడానికి ఇతర పార్టీల నుంచి ఎవరైనా ముందుకు వస్తున్నారా? అని మీనాక్షి నటరాజన్ మంత్రులను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలాఉండగా ఆమె ఎక్కువగా అంతర్గత పార్టీలో విభేదాలపైనే ఫోకస్ పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో తనకు నివేదిక వస్తున్నదని అన్నట్లు సమాచారం. మంత్రులు తమ శాఖల పని బాగున్నా, పార్టీపై దృష్టి కేంద్రీకరించడం లేదని ఆమె అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ కార్యకర్తలే పట్టుగొమ్మలని, నాయకులను, కార్యకర్తలను చేరదీయాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని మీనాక్షి అన్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఫిర్యాదులు లేకుండా అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని ఆమె వారికి చెప్పారు. ఇదిలాఉండగా ఖమ్మంలో బిఆర్ఎస్, బిజెపి బలపడుతున్నాయని ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆమె మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించగా, ఆ రెండు పార్టీలూ తమ జిల్లాలో బలహీనంగా ఉన్నాయని వివరించారు.
‘సర్’పై దృష్టి పెట్టండి..
ఓటర్ల జాబితా సవరణ (సర్)పై దృష్టి పెట్టాలని ఆమె మంత్రులకు సూచించారు. అర్హులైన ఓట్లు జాబితా నుంచి పోరాదని, కొత్తగా నమోదు చేసుకునే వారి విషయంలో పార్టీ శ్రేణులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని మీనాక్షి చెప్పారు. ఇంకా ఆమె వివిధ జిల్లాలకు చెందిన 23 మంది సీనియర్లతో మంతనాలు జరిపారు.

