తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలిలో కొత్త తరహాలో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్.. రాజకీయాలకు కొత్త అయిన విజయ్.. రాజకీయ వ్యూహాల్లో తనదైన శైలిని చూపిస్తున్నారు. విజయ్ పార్టీకే దక్కిన తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఇచ్చారు. తన సీఎం పదవికి సహకరించిన కాంగ్రెస్ కు ప్రతిగా రాజ్యసభ సీటును ఇచ్చిన ఆయన.. తన ప్రభుత్వ స్థిరత్వానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినా… సీఎంగా విజయ్ ప్రమాణం చేయడానికి సరిపడా సంఖ్యాబలం లేకపోయిన సంగతి తెలిసిందే. ఈ డీఎంకేతో తనకున్న 5 దశాబ్దాల బంధాన్ని తెంచేసుకున్న కాంగ్రెస్ పార్టీ టీవీకే మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత వీసీకే, కమ్యూనిస్టులు, అన్నాడీఎంకే చీలిక వర్గం సహాయంతో విజయ్ సీఎం పదవిని దక్కించుకున్నారు.
విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో అంత బలం లేదనే చెప్పాలి. అసలు ఏ ఒక్క జాతీయ పార్టీకి కూడా తమిళ ప్రజలు అంతగా ఓట్లేసే పరిస్థితి లేదు. ఈ వాస్తవ వాస్తవాన్ని చాలా కాలం క్రితమే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకుంది.
ఈ పొత్తు 50 ఏళ్లుగా అలా కొనసాగుతూనే వచ్చింది. అయితే కొత్త పార్టీ పెట్టిన విజయ్… తొలి ఎన్నికల్లోనే అటు అదికార డీఎంకేతో పాటు ఇటు విపక్ష అన్నాడీఎంకేను కూడా చిత్తు చేయడంతో భవిష్యత్తును మరోమారు బేరీజు వేసుకున్న హస్తం పార్టీ.. డీఎంకేతో స్నేహానికి ముగింపు పలికి విజయ్‌తో చేతులు కలిపింది.
డీఎంకేతో మైత్రిని వీడి కాంగ్రెస్ పార్టీ టీవీకే ఎంత దన్నుగా నిలిచిందన్న విషయం ఇతరులన్నా విజయ్ కే ఎక్కువగా చెప్పాలి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన తర్వాత విజయ్ కి ఇతర పార్టీల నుంచి మద్దతు దక్కింది. ఈ నేపథ్యంలో తాను సీఎం కావడానికి తొలి అడుగు కాంగ్రెస్ నుంచే పడిందని విజయ్.
ఈ కారణంగానే తనను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీకి తానూ ఏదో ఒకటి చేయాలి కదా అన్న భావనతో టీవీకే దక్కిన తొలి రాజ్యసభ సీటునే ఆయన కాంగ్రెస్ కు ఇచ్చారు. వెరసి తన ప్రభుత్వాన్ని మరింత స్థిరం చేసుకునే దిశగా విజయ్ ఈ కీలక అడుగు వేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం పార్లమెంటులో సరైన బలం లేని కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. పెద్దల సభలో ఓ మోస్తరుగా ప్రభావం చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి విజయ్ తాజా రాజ్యసభ సభ్యత్వంతో మరింత బలం చేకూరుతుందని చెప్పాలి.
విజయ్ ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా తమిళనాడుకే చెందిన ప్రవీణ్ చక్రవర్తిని నిలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నైలో జన్మించిన ఆయన బిట్స్ పిలానీలో డిగ్రీ పూర్తి చేసి వార్టన్ స్కూల్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. కాంగ్రెస్ లో చేరిన ఆయన ప్రస్తుతం పార్టీ డేటా అనలిటిక్స్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

