- కార్మిక శాఖకు కొత్త పేరు ‘SHAKTI’
- స్కిల్స్ యూనివర్సిటీకి ఐటీఐలు, పాలిటెక్నిక్స్
- యువత నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వ కీలక నిర్ణయం
- అడ్మిషన్లపై ప్రభావం లేదని స్పష్టీకరణ
శక్తి : తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో “కార్మిక, ఉపాధి, శిక్షణ , కర్మాగారాల శాఖ” (లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్) పేరును మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ విభాగాన్ని “నైపుణ్య మానవ మూలధనం , జ్ఞాన శిక్షణ కార్యక్రమాలు శాఖ” (డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ – శక్తి) గా పిలవబడుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్ నంబర్ 97 (GOMs.No:97) ద్వారా ఉత్తర్వులు విడుదల చేయబడ్డాయి.
ఒకే గొడుగు కిందికి విద్యా, సాంకేతిక సంస్థలు
నూతనంగా రూపాంతరం చెందిన ఈ ‘శక్తి’ (SHAKTI) శాఖ పరిధిలో యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కీలక విద్యా సంస్థలను ప్రభుత్వం బదలాయించింది. ఇందులో భాగంగా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు.. ఇంతవరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో ఉన్న ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (YISU) సబ్జెక్టును ఇకపై నూతనంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ శాఖకు బదిలీ చేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ఫెక్షన్లు (ITIలు) , అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCలు) ఇకపై నేరుగా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ సంస్థాగత పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎకోసిస్టమ్ , ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అడ్మిషన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు
పరిపాలనా సౌభ్యం, విద్యా ఉపాధి నైపుణ్యాల నాణ్యత, యువతకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ భారీ మార్పులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఈ అడ్మిషన్ల ప్రక్రియపై కొత్త నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీల్లో కొనసాగుతున్న ప్రవేశాల ప్రక్రియ యథావిధిగా సాగుతుందని స్పష్టం చేశారు. ఈ నూతన సంస్కరణలకు అనుగుణంగా ‘తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్-1982’, ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్-2024’ చట్టాలకు అవసరమైన సవరణలు సంబంధిత శాఖలను సీఈఎస్ స్వాధీనం చేసుకుంది.

