హైదరాబాద్ శివార్లలోని గండిపేట భూకుంభకోణం కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ రూ.12 కోట్ల భారీ భూకుంభకోణంలో… ప్రధాన నిందితుడైన రాధాకృష్ణతో పాటు, అతను తప్పించుకోవడానికి సహకరించిన డ్రైవర్ ప్రవీణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు… వారి వద్ద నుంచి భారీగా నకిలీ పత్రాలు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
గండిపేట గ్రామం సర్వే నెంబర్ 18లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై ఈ కేటుగాళ్లు కన్నేశారు. సీనియర్ ప్రభుత్వ అధికారుల పేర్లు, సంతకాలను ఫోర్జరీ చేసి… ఒరిజినల్‌గా కనిపించేలా నకిలీ జీఓలు, తప్పుడు CCLA ప్రొసీడింగ్‌లు, నకిలీ ఎన్ఓసీ (NOC)లను సృష్టించారు. నిందితుల వద్ద నుంచి ఒరిజినల్ ఫ్యాబ్రికేటెడ్ జీఓలతో పాటు… 5 ల్యాప్‌టాప్‌లు, 12 చెక్కులు, 13 స్టాంపులు, 7 బ్యాంక్ పాస్‌బుక్కులు, 10 ఐటీఎం కార్డులు, భూములకు సంబంధించిన 31 నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారు.
►ఇంకా చదవండి | చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు.. చీటింగ్ మినిస్టర్ : సజ్జల
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాధాకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో ఏపీ సెక్రటేరియట్ ఐటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన రాధాకృష్ణ… అక్కడ ఉన్న పరిచయాలతో తానే ఒక డిప్యూటీ కలెక్టర్ అని, అడ్వకేట్ అని చెప్పుకుంటూ మోసాలకు తెరలేపాడు. సచివాలయంలో అటెండర్ ఉద్యోగాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గతంలోనే పలువురి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఈ ఉద్యోగాల మోసాల ద్వారా వచ్చిన డబ్బుతో రాధాకృష్ణ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.
నిందితుడు రాధాకృష్ణపై ఇప్పటికే, నల్గొండ, మొయినాబాద్, రాజేంద్రనగర్, నెరెడ్మెట్, గోదావరిఖని, కర్నూలు తదితర ప్రాంతాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ గండిపేట భూకుంభకోణం కేసుకు సంబంధించి గతంలోనే ముగ్గురిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు… తాజాగా రాధాకృష్ణ, అతని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

