Modi Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ప్రారంభం అయింది. ప్రస్తుతం మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అందుకే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై బలమైన చర్చ నడుస్తోంది. కొత్తగా కొంతమంది ఎంపీల పేర్లు కేంద్ర మంత్రులుగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో చేర్పులు మార్పులు ఉంటాయన్న టాక్ ఉంది. మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ అనేక పేర్లు తెరపైకి వచ్చాయి.
* తెలంగాణలో ఆ ఇద్దరి మధ్య..
తెలంగాణకు సంబంధించి బండి సంజయ్ మార్పు ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల బండి సంజయ్ కుమారుడితో పొలిటికల్‌గా బిజెపికి డామేజ్ జరిగింది. అందుకే ఆయన మార్పు ఖాయమన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా ధర్మపురి అరవింద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వరుసగా నిజామాబాద్ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. పిసిసి మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడే అరవింద్. పొలిటికల్ గా మంచి పట్టు ఉంది. ఆపై దూకుడు కలిగిన నేతగా గుర్తింపు ఉంది. బండి సంజయ్ మార్పు జరిగితే అరవింద్ వైపే హై కమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు ఈటెల రాజేందర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కేంద్ర మంత్రి పదవితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోరుకున్నారు. దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తితో వార్తలు వచ్చాయి. పైగా ఆయన తిరిగి గులాబీ పార్టీలో చేరిపోతారని కూడా తెగ ప్రచారం నడిచింది. ఒకవేళ బండి సంజయ్ మార్పు ఉంటే మాత్రం ఈటెల రాజేందర్ పేరు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
* ఏపీలో మార్పులు..
ఏపీ నుంచి కూడా చాలామంది ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిజెపి నుంచి కేంద్రమంత్రిగా ఉన్న నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మను మార్చుతారన్న ప్రచారం ఉంది. ఆయన స్థానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను తీసుకుంటున్నారని. అదే సమయంలో పురందేశ్వరి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె కూడా ప్రయత్నాల్లో చూపిన సమాచారం. ఇంకో వైపు టిడిపికి మరో మంత్రి పదవి ఇస్తారని. ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేతగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఉంది. కోస్తాంధ్రలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఈసారి రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత అందుకే చూస్తున్నారు. అదే జరిగితే నంద్యాల ఎంపీగా ఉన్న బైరెడ్డి శబరి కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. జనసేనకు ఇవ్వాలనుకుంటే వల్లభనేని బాలశౌరి ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది ఊహాగానమేనా.. లేకుంటే నిజంగా కార్యరూపం దాల్చుతుందా? అనేది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

