- పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
- అమరావతిని హైందవ రాజధాని చేస్తామనడం హాస్యాస్పదం
- మార్క్సిజంపై మరింత అవగాహన
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథరెడ్డి
(విశాలాంధ్ర-తిరుపతి)
కేంద్ర, రాష్ట్ర పాలకులు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిద్ధాంతపరమైన, చైతన్యవంతమైన ఉద్యమాలను నిర్మించాలని, నూతన కమ్యూనిస్టు కార్యకర్తలు మార్క్జంపై మరింత అవగాహన పెంచుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే ఇండియాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ధ్వజమెత్తిన ఆయన, అమరావతిని హైందవ రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం అత్యంత హాస్యాస్పదమని దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా పరిధిలోని సీపీఐ శాఖ కార్యదర్శుల మూడు రోజుల సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ తరగతులు శుక్రవారం ఉదయం స్థానిక గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డి భవనాల్లో ప్రారంభమయ్యాయి. బండి చలపతి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ తరగతులకు హరినాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు మరింత నిబద్ధతతో ముందుకు సాగి, స్థానిక సమస్యలతో పాటు సామాజికంగా కూడా సహకరించాలని ఆయన సూచించారు.
అమెరికాకు మోదీ దాసోహం.. ఆర్థిక వ్యవస్థ దివాళ
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై హరినాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేశారని. దేశంలో ప్రత్యామ్నాయ మార్గాలు, మోదీ ప్రభుత్వం అమెరికా ఆజ్ఞలను పాటిస్తూ దేశ ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటన్నారు. అమెరికా అధ్యక్షుడికి మోదీ దాసోహం కావడం వల్లే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ధ్వజమెత్తారు. “ప్రజాప్రతినిధులు విమానాల్లో తిరుగుతుంటే.. సామాన్యుడు మాత్రం ఖర్చులు తగ్గించుకుని సైకిళ్లపై తిరగాలని ప్రధాని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీడియా, సోషల్ మీడియా మొత్తం మోదీ కనుసన్నల్లోనే నడుస్తోందని, కమ్యూనిస్టు సిద్ధాంతంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడులను కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. అలాగే, ఓటు హక్కును నిలుపుకోవాలంటే తల్లిదండ్రులు 2002 నాటికే ఓటరై ఉండాలనే నిబంధనను తెచ్చి, లక్షలాది ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని. దేవుడి మీద భక్తి లేకపోయినా కేవలం రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ప్రశ్నించినందుకు, సమాధానం చెప్పలేక ఆర్ఎస్ఎస్ గుండాలతో ఎడిటర్ రమణమూర్తిపై దాడి చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు శోచనీయం
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతిని హైందవ రాజ్యంగా కడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం శోచనీయమన్నారు. అమరావతి ఎప్పుడూ ‘ప్రజారాజధాని’గానే ఉండాలని స్పష్టం చేశారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న భూములు చాలవన్నట్లు, ఇంకా వేల ఎకరాలు సేకరిస్తామని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు, అవినీతి విపరీతంగా పెరిగాయని, అవినీతి వికేంద్రీకరణ అయిపోయిందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇందుకు పరాకాష్టగా మారారని. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచిన వ్యక్తిపై జనసేన కార్యకర్తలు రాళ్ల దాడులు చేశారని, లాకప్ డెత్ చేసి శవాన్ని మాయం చేశారని హరినాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై చైతన్యవంతమైన ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి. మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. మొదటిరోజు శిక్షణలో భాగంగా.. ‘మార్క్సిజం అంటే ఏమిటి?’ అనే అంశంపై పి.ఎల్. నరసింహులు ఉపన్యసించారు. ‘దోపిడీ – వివిధ రూపాలు, శాస్త్రీయ సోషలిజం’ అనే అంశంపై డాక్టర్ కె. వి. రమణ కార్యకర్తలకు సమగ్రంగా బోధించారు.

