ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి ప్రభుత్వం లాక్కుంటుందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నా… వారి ఇష్టా ఇస్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం పోలీసుల బలగాలను మోహరించి ఆయా భూములను బలవంతంగా లాక్కున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. పెద్ద సంఖ్యలో రైతుల భూములను లాక్కునేందుకు అధికారులు పోలీసులతో కలిసి రాగా.. వారిని రైతులు అడ్డుకున్నారని, రైతులను పోలీసులు లాగి పడేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరి ఈ వ్యవహారంలో జరిగిన అసలు విషయమేమిటన్న దానిలోకి వస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
అమరావతి పరిధిలోని ఉండవల్లి పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం కొంత భూమి అవసరం కాగా… దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఇదివరకే ప్రభుత్వం జారీ చేసింది. ఉండవల్లిలోని కేవలం 2.77 ఎకరాల భూమి సేకరణ కోసం ఈ నోటిఫికేషన్ జారీ కాగా… ఆ భూమికి పరిహారంగా రూ.7.68 కోట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిహారాన్ని బాధిత రైతులకు శుక్రవారం రాత్రే అధికారులు యత్నించగా… వారు పరిహారాన్ని తిరస్కరించారు. ఈ పరిహారాన్ని అధికారులు విజయవాడలోని ఎల్ఆర్ఆర్లో డిపాజిట్ చేశారు.
ఇక గడువు ముగిసినా రైతుల నుంచి స్పందన కనిపించింది. ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేలా అదికారులు పోలీసులు బలగాలతో అక్కడికి వెళ్లారు. భూములను స్వాధీనం చేసుకునే సమయంలో 2.7 ఎకరాలకు చెందిన 10 మంది రైతులు రైతులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య ఓ మోస్తరు పెనుగులాట జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎట్టకేలకు భూసేకరణ పూర్తయింది. ఫలితంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది.
అమరావతి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే పనిలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందంటూ వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ భారీ ప్రకటనను విడుదల చేశారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే భూములను లాక్కుంటున్నట్లు ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు. అయితే రైతులకు పరిహారాన్ని ప్రకటించి.. ఆ పరిహారాన్ని రైతులకు అందజేసేందుకు వెళ్లగా… నిరాకరణ ఎదురైన నిర్వాహకులు బయటపెట్టడంతో జగన్ ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది.

