హైదరాబాద్ : మెహదీపట్నంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.26.80 లక్షల విలువైన 137.60 గ్రాముల ఎండీఎంఏ, వోల్వో కారు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్లు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గాంధీనగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఎం. శుభమ్ కుమార్ మిశ్రాకు గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. అతడి చిన్ననాటి స్నేహితుడు బుసా సాయి నిఖిల్ యాదవ్ వద్ద నుంచి డ్రగ్స్ సేకరించేవాడు. తన అవసరాలతో పాటు ఇతరులకు విక్రయించేందుకు కూడా ఎండీఎంఏ తెప్పించుకునేవాడు.
ఇటీవల చిలకలగూడ పోలీసులు సాయి నిఖిల్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయినా శుభం తన దందా ఆపలేదు. తన స్నేహితులు సోహమ్ నాయక్, కలంగి రాజేశ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయాలు కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో తెచ్చిన ఎండీఏను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు అమ్మేవారు.
డ్రగ్స్ సరఫరా కోసం శుభమ్ రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడని పోలీసులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో స్వయంగా వెళ్లి డ్రగ్స్ అందించేవాడు. తన అన్న ముంతున్ కుమార్ మిశ్రా ద్వారా కూడా డెలివరీ చేయించేవాడని.
పక్కా సమాచారంతో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు శనివారం దాడులు నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మహ్మద్ అబ్రార్, రషీద్ బిన్ హుస్సేన్, ఖాజా జోహైబుద్దీన్, అబ్దుల్ షాబాజ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు.

