కుర్తాగా మారిన రైల్వే బెడ్‌షీట్: భారతీయ రైల్వేలకు చెందిన బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్ ఏసీ కోచ్‌ల నుంచి అదృశ్యమవుతున్న ఘటనలు ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం. అయితే మరోసారి ఈ అంశంపై ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. గత కొన్నేళ్లలో లక్షల సంఖ్యలో రైల్వే బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవల్లు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనల భారం చివరకు రైల్వే సిబ్బందిపైనే పడుతుండగా.. నష్టాన్ని భర్తీ చేసేందుకు వారి జీతాల నుంచి కోత విధిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌరిహార్ మార్కెట్లో ఓ వృద్ధుడు వెస్టర్న్ రైల్వే లోగో ఉన్న బెడ్‌షీట్‌తో కుట్టించినట్లుగా కనిపించిన తెల్లటి కుర్తా ధరించి తిరుగుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని ఓ కంటెంట్ క్రియేటర్ వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియోలో సంబంధిత కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ.. “గౌరిహార్ మార్కెట్లో ఈ కాకాను చూడండి.. వెస్టర్న్ రైల్వే బెడ్‌షీట్‌తో చేసిన కుర్తా వేసుకుని ఎంతో హాయిగా తిరుగుతున్నారు” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మొదట తనను వీడియో తీస్తున్నారేమోనని వృద్ధుడు కొద్దిగా అప్రమత్తంగా కనిపించినా, ఆ తర్వాత ఎలాంటి సంకోచం లేకుండా మార్కెట్లో తిరుగుతూ కనిపించాడు.
ఈ వీడియో వైరల్ అయిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “రైల్వే ఆప్కీ సంపత్తి హై” అనే మాటను చాచా చాలా సీరియస్‌గా తీసుకున్నాడని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు “ఇదే అసలైన ఫ్యాషన్” అంటూ సరదాగా స్పందించారు. ఇంకొకరు “ఈయనే రైల్వే బ్రాండ్ అంబాసిడర్” అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ముందు రైల్వే ఏసీ కోచ్‌లలో అనధికారికంగా నడిపే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా.. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు మరో ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. పాత రైల్వే బెడ్షీట్లను రైల్వే శాఖ వేలం వేస్తుందని, వాటిని కొనుగోలు చేసిన వారు తిరిగి వివిధ వస్తువులుగా తయారు చేసి అమ్మకాలు చేసే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడు ధరించిన కుర్తా కూడా అలాంటి వేలంలో కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌తో తయారై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే వీడియోలో కనిపించిన వృద్ధుడికి వెస్టర్న్ రైల్వే లోగో ఉన్న ఆ బెడ్‌షీట్ ఎలా దక్కింది అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే వీడియోలో కనిపించిన కుర్తా నిజంగా రైల్వే బెడ్షీట్తోనే తయారైందా అనే అంశం కూడా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.

