Published on: 12:52 pm, 19 జూన్ 2026
సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేసుకు సంబంధించిన ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించే బాధ్యతను ఈ బృందానికి అప్పగించారు.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న సీఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. అనంతరం ఫిర్యాదు ప్రతిని విజయలక్ష్మికి అందించారు. కేసు దర్యాప్తు అధికారిగా దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో కూడిన ప్రత్యేక బృందం ఈ రోజు సాయికృష్ణ నివాసానికి చేరుకుంది.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు చేయడంతో సీఐ నాగరాజును ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను కూడా ఏర్పాటు చేసింది.

