తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ ఇప్పటిది కాదు. దాదాపు 20 సంవత్సరాలకు పైగానే ఈ డిమాండ్ ఎప్పుడూ చర్చల్లోకి వస్తోంది. తరచుగా ఆయన గురించి మాట్లాడిన ఎవరైనా భారతరత్న తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ ఆలోచన సాకారం కాలేదు.
తాజాగా జరిగిన మహానాడులో మరోసారి అన్నగారికి భారతరత్న తీసుకురావాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. సాక్షాత్తు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నగారికి భారతరత్న విషయంలో ప్రజల ఆకాంక్షను కూడా వివరించారు. కచ్చితంగా భారతరత్నకు అన్ని అర్హతలు ఉన్నాయని చంద్రబాబు తేల్చి చెప్పారు.
అయితే ప్రస్తుతానికి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ దఫా ఎన్టీఆర్‌కు భారతరత్న తీసుకురావాలి అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కనక రాకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం అనేది చంద్రబాబు ముందున్న కర్తవ్యం.
భారతరత్న ప్రకటించేందుకు రెండు రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికైతే భారతరత్న కోరుకుంటున్నారో వారి విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నిర్ణయించడం. వెంటనే కదలిక వచ్చి భారతరత్న విషయంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. గతంలో బీహార్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ విషయంలో ఇలాగే చేశారు.
రెండోది.. కేంద్రమే జోక్యం చేసుకుని భారతరత్న ఇవ్వడం. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్‌కు కేంద్రమే జోక్యం చేసుకుని భారతరత్న ప్రకటించింది.
ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఇప్పుడు చంద్రబాబు ఎంచుకోవాలి. కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా అయినా సాధించాలి. లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావాలి.
ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకుని వేగంగా ముందుకు వెళ్లగలిగితే వచ్చే ఏడాది భారతరత్న ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 20 సంవత్సరాలుగా వేచి చూస్తున్న అభిమానులు.. తెలుగుజాతి గర్వించే క్షణాలు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయన్నది వాస్తవం.

