- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
- ఫ్లెక్సీ విషయంలో మరోసారి బయటపడ్డ రెండు వర్గాల విభేదాలు
- ఎమ్మెల్యే ఆహ్వానం ఫ్లెక్సీని ఎమ్మెల్సీ వర్గం తీసేయించిందని ఆగ్రహం
OTR: అక్కడ హస్తం గట్టిగా బీటలువారుతోందా? ఫెవిక్విక్ పెట్టి అతికించినా అతుక్కోనంతగా గ్యాప్‌లు పెరిగిపోయాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడమే అరుదైతే… ఒకవేళ గత్యంతరం లేక ముఖ ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదా? ఎవరు నాయకులు? ఎందుకా యుద్ధం?. వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మనస్పర్థలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయుల మధ్య అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇటీవల వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఫ్లెక్సీ వివాదం రేగింది. వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సర్పంచ్ భర్త శ్రీనివాస్ తొలగించేశాంటూ ఆయనపై పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. మంబాపూర్లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీ అది. భార్య సర్పంచ్ కాగా…. భర్త శ్రీనివాస్ షాడోలా మారి పెత్తనం చెలాయిస్తున్నారని, సొంత పార్టీ వాళ్ళని కూడా చూడకుండా ఆయనే ఫ్లెక్సీని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి ఇరు వర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పూర్తి వివరాలు సేకరించాక కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు పంపారు.
మాంబాపూర్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు కావడంతో ఎమ్మెల్యే మనుషులు కావాలనే గొడవ చేసారంటూ జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇదేకాక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయని, ఆ విషయం పలుమార్లు బహిర్గతం అయిందని కూడా చెబుతున్నారు. నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలలో ఇద్దరూ కలిసి పాల్గొనడం చాలా అరుదన్నది స్థానిక నాయకుల మాట. ఒకవేళ ఇద్దరూ కలిసి పాల్గొంటే ప్రోటోకాల్ సమస్య తలెత్తుదామో, స్టేజీ మీద ఒకరి ముఖం మరొకరు చూసుకోకుండానే కార్యక్రమం పూర్తి చేయడమో కామన్ అంటున్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారుల పోస్టింగ్స్ విషయంలో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ఒక అధికారికి, ఎమ్మెల్సీ మరొక అధికారికి విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో గందరగోళం రేగింది. అనర్హులకు ఇళ్ళు ఇచ్చారంటూ కొందరు ఆందోళన చేశారు. గతంలో పెద్దేముల్ మండల విద్యాధికారి విషయంలో కూడా వివాదం చెలరేగింది. ఒక ఎంఈఓ ఉండగానే మరో ఎంఈఓకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. దీనితో పాత ఎంఈఓ ట్రాన్స్ ఫర్ అవక… కొత్తాయన జైన్ అవలేక సతమతం అయ్యారు. వాళ్ళలో కూడా ఒకరికి ఎమ్మెల్యే మద్దతు, మరొకరికి ఎమ్మెల్సీ మద్దతు ఇవ్వడం పెద్ద చర్చకు కారణం అయింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుకోవడానికి అధిష్టానం చొరవ చూపక పోవడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ పట్టు జారడం ఖాయమంటున్నారు కార్యకర్తలు.

