వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో నలభై శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న జగన్ దానిని పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు కూటమి పార్టీలోని ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ రెండు బలమైన పార్టీలు. జనసేనకు ఏడు శాతం, బీజేపీకి ఐదు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే అవి కూడా రావు. కానీ వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలు కలసి పోటీ చేసినప్పటికీ వారి ఓటు బ్యాంకు తన దరిచేరేలా పావులు కదుపుతున్నారు. అందుకే మరో ఎన్నికలు ఉండగానే జగన్ తన గేమ్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
గత ఎన్నికల్లో యువత, మధ్యతరగతి కూటమి, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది వైపునకు మొగ్గు చూపారన్న అనుమానం జగన్‌లో ఉంది. అందుకే యువతను ఆకట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్ల నుంచి నానుస్తుందని పదే పదే జగన్ ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీని అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. అలాగే నిరుద్యోగుల్లో మెగా డీఎస్సీలో అవకతవకలంటూ ఆరోపణలు చేస్తూ కొంత తనవైపునకు తిప్పుకునేందుకు జగన్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడో చెప్పాలంటూ కూటమి సర్కార్ ను నిలదీస్తున్నారు.
ఇక పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా పెట్రో ఉత్పత్తులను పెంచితే దానిని కూటమి సర్కార్ ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఉన్నాయని ఉద్యమిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన జగన్ వారి డిమాండ్లను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తున్నారు. అలాగే తమ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ప్రయివేట్కరిస్తుందని ఆర్టీసీ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ ఓటు బ్యాంకు పెరగనుందా? లేదా? అన్నది రానున్న ఎన్నికల్లో తేలనుంది.

