హుజూరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ మాట్లాడారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
”కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతుబంధు ఎగ్గొట్టారు. రెండోసారి మూడు ఎకరాలకు, మూడోసారి రెండెకరాలకే ఇచ్చారు. మొత్తం రూ.20 వేల కోట్లు ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని చెబుతున్నారు. కెసిఆర్ క్రమం తప్పకుండా రైతుబంధు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న రైతు భీమా కూడా బంద్ అయింది. 24 గంటల ఉచిత కరెంటు పోయింది. కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. రైతులు ఆ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ సొమ్ము రూ.100 కోట్లతో సిఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ సోకులకు నిధులు ఉంటాయి కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు బంధు, రైతుబీమాకు ఉండవా? రైతులకు డబ్బు ఇచ్చేందుకు రేవంత్‌కు మనసు రావడం లేదు” అని హరీష్ అన్నారు.

