మన తెలంగాణ/తిమ్మాపూర్: కరీంనగర్ నుంచి హైదరాబాద్కు సుమారు 40 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు ఉద యం కరీంనగర్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలు దేరింది. దాదాపు మూడు, నాలుగు అడుగుల మేర ప్రయాణం పూర్తి చేసి అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బస్సులో అకస్మాత్తుగా దట్టమైన పొగ, మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అప్రమత్తమై ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్క న ఆపి డోర్లు,ఎమర్జెన్సీగేట్లు తెరిచి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి పంపాడు. అనంతరం అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడంతో ఫలితం లేక పోగా, మంటలు వేగంగా వ్యాపించి నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగాలని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సులో అకస్మాత్తుగా మంటలు ఎలా వ్యాపించాయో తెలియాల్సి ఉంది.

