విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ఃజయంత్,ఃఅభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, రాష్ట్రశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు గెడ ఆహారంగా తినిపించిన పవన్… వాటికి వీడ్కోలు పలికారు. ఈ రెండు కుంకీ ఏనుగులను తొలుత పార్వతీపురం మన్యం నుంచి గుచ్చిమి క్యాంపునకు తరలించి, అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. జయంత్, అభిమన్యులకు గతంలో కూడా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు జరిగాయి.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దుల నుంచి ఏనుగులు రాష్ట్రానికి వచ్చి పంటలను నాశనం చేస్తున్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఒడిశా నుంచి కూడా కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని. ఆలోగా మన వద్ద ఉన్న కుంకీలతోనే జనవాసాల్లోకి వచ్చిన ఏనుగులను తిరిగి అడవుల్లోకి మళ్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

