Revanth Chandrababu : తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ.. ఇప్పటికి ఇక్కడ రాజకీయాలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గురించి పెద్దగా తెలంగాణ నాయకులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలో లేడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబును ప్రతి సందర్భంలో కేసీఆర్ బూచిగా చూపించారు. తెరపైకి ఓటుకు నోటు అనే కేసును తీసుకొచ్చి చంద్రబాబును ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేశారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అనేక రకాలుగా మేళ్లు చేశారు. ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఆహ్వానించారు. అప్పటి రోజులు..
ఇప్పుడు తెలంగాణలో పవర్ సెంటర్ కాంగ్రెస్ చేతిలో ఉంది.. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి అంటేనే గులాబీ పార్టీకి నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేయకపోయినా సరే విమర్శిస్తూనే ఉంటుంది. దానికి చంద్రబాబు ప్రస్తావన జతచేస్తూ ఉంటుంది. పైగా సెంటిమెంట్ రాజకీయాలను రగిలిస్తూ ఉంటుంది.. ఆ మంటల్లో చలికాచుకుంటూ ఉంటుంది గులాబీ పార్టీ. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద వస్తోంది. ఇంతటి కరువు కాలంలో కూడా ప్రాణహిత నదికి వరదరావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ వరద నీరు వృధాగా వెళుతుంది.
వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీలు కృంగిపోక పోతే.. మిగిలిన పంప్ హౌస్లు సక్రమంగా ఉంటే ఈ నీటిని నిలువ చేసుకునే అవకాశం ఉండేది. కరువుకాలంలో ఎల్లంపల్లి.. ఎస్ ఆర్ ఎస్ పి వంటి ప్రాజెక్టులను నింపే అవకాశం ఉండేది. మేడిగడ్డలో బ్యారేజీ కుంగిపోవడం.. మిగిలిన సుందిళ్ల.. అన్నారం.. కన్నెపల్లి పంప్ హౌస్లు కూడా పనికిరావని చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను రన్ చేయడం లేదు. వచ్చిన నీటిని వచ్చినట్ట కిందికి వదిలిపెడుతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పంపిన నీళ్లను వృధాగా సముద్రంలోకి పంపిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇంతవరకు కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని టీకాల నీరు పంప్ చేశారు అనేదానికి అధికారిక లెక్కలు లేవు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మించిన బ్యారేజీలు.. ఇతర పంప్ హౌస్లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరమ్మతులు చేసిన తర్వాత వాడాలని భావిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇదే ప్రకటించారు. అయితే గులాబీ పార్టీ ఇందులో కూడా రాజకీయం చేస్తోంది. ఇప్పుడు వరద నీరు వస్తున్నదని.. దానిని సక్రమంగా వాడకుండా.. రేవంత్ రెడ్డి గురుదక్షిణగా ఆ నీటిని ఏపీకి వదిలేస్తున్నాడని గులాబీ పార్టీ.
వాస్తవానికి వచ్చిన వరద నీరు కిందికి వెళ్లడం సహజం. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం సక్రమంగా పనిచేస్తే ఆ నీటిని నిలువ ఉండే అవకాశం ఉండేది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలు.. పంప్ హౌస్ లు సక్రమంగా పనిచేయవు.. ఆ నీటిని వృధాగా కిందికి వదిలివేయాల్సి వస్తోంది. పోలవరం ప్రాంతంలో గోదావరి ప్రవాహం ఉదృతంగా ఉంది. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీరు నిల్వచేసే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ గులాబీ పార్టీ గొప్ప రాజకీయాలను ఏర్పాటు చేసింది. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా ఆ నీటిని చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ రెడ్డి వదిలేస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. నిజానికి పోలవరం పథకం పూర్తికానప్పుడు ఆ నీటిని చంద్రబాబు ఏం చేసుకుంటారు.. ఒకవేళ చంద్రబాబు కోసం ఆ నీటిని రేవంత్ రెడ్డి వదిలిపెడితే.. ఇక్కడి ప్రజలు క్షమిస్తారా.. సొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఊరుకుంటారా.. పాపం ఈ మాత్రం సోయి కూడా గులాబీ పార్టీకి లేకపోవడం దారుణం.

