రైతు ఆశీర్వాద సభగా నామకరణం
నవతెలంగాణ-చింతకాని
ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పలు ప్రాంతాలను సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, జిల్లా సీపీ సునీల్ దత్తో కలిసి పరిశీలించారు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఈనెల 26న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి విక్రమార్క.. సభ ప్రాంగణాన్ని అధికారంగా ‘రైతు ఆశీర్వాద సభ’గా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకకైనా రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. రైతుల కష్టానికి గౌరవం తెలుపుతూ వారి ఆశీర్వాదాలతోనే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుంది. అందుకే ఈ సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరు ఖరారు చేశారు. రైతు రుణమాఫీ, పెట్టుబడి సహాయం, సాగునీటి కల్పన వంటి పలు కార్యక్రమాలు రైతుల అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ నెల 26న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వేలాదిగా రైతులు, వ్యవసాయ కూలీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. రైతుల ఆశీస్సులతో తెలంగాణ సస్యశ్యామలంగా కావాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహిస్తామని తెలిపారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతు ఆశీర్వాదమే
తెలంగాణ అభివృద్ధికి నిజమైన బలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, సుడా చైర్మెన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్, అంబటి వెంకటేశ్వర్లు, కూరపాటి కిషోర్, కిలారు మనోహర్ బాబు ఉన్నారు.
పోస్ట్ జగన్నాధపురంలో సీఎం సభ ప్రాంగణాన్ని..పరిశీలించిన డిప్యూటీ సీఎం మొదట కనిపించింది నవతెలంగాణ.

